పిలిస్తే పలికేనని
రమ్మంటే జాబిలి వచ్చేనని
ఆకలి సమయంలో
గోరుముద్దకోసం అమ్మ చెప్పింది ఓ అబద్దం ...!
వెతకలేనంటూ
దాగుడుమూతలో ఓడినానంటూ
చిన్న పెదవిపైన చిరునవ్వుకోసం
నాన్న చెప్పినాడు ఓ అబద్దం ...!
చీకటంటే సూరీడికి సెలవని
ఉరుములంటే మేఘాల కోపాలని
తెలియదు ఎందుకో
బామ్మ చెప్పింది ఓ అబద్దం ...!
ఇసుకలో గుడిని
కాయితంలో పడవని
చేసినవారే గొప్ప అని
సరదాకోసం స్నేహితుడు చెప్పినాడు ఓ అబద్దం ...!
మరెన్నో అబద్దాలు వింటూ
కలతలేని చందమామలా నవ్వుకొంటూ
హాయిగా గడిపిన ఆ రోజులు
మళ్ళీ వచ్చేనా ... ?
