Monday, January 22, 2024

అభిరామ !

 


తరాలు ఎరగని వరాలు 

రాక్షస మాయలు మాయా మృగాలు  

అన్నిటినీ గెలిచాయి రాముని బాణాలు 


మాతృ మూర్తిలోని మత్సరం 

నిధులకు మిన్న ఆ స్వర్ణ భవనం 

ఓటమి లేదు ! గుణ పరీక్షలో రామునికే విజయం 


పేరు తారక నామం 

రూపము పుంసా మోహనం 

కామ క్రోదాలను అణిచిన  ఆదర్శ జీవనం 


రామ రాజ్యం అంటే ధర్మ దేవత ఉత్సవం 

సత్యం వద ధర్మం చరా అంటే రామాయణం 

అందుకే ప్రతీ ఊరిలో కట్టాము రామాలయం 


Thursday, May 30, 2019

దేశమంతా నమో నమో ...!



కడలి కెరటాల ఘోషమో 
కన్నెర్రచేసిన ఉప్పెన ఆవేషమో 
ఏదో ఈ శబ్దం ... నమో నమో 

మరో భగీరథుని తపమో 
కాశీనాథుని అభయమో 
అవని గొంతెత్తి పలికింది నమో నమో ... 

నేటి భారత గీతమో 
భారతీయుల నమ్మకమో
దేశమంతా ఒకటే మాట నమో నమో .... 

Friday, August 3, 2018

నిన్ను మరిచేదెలా...



చీకటి దేశానికి 
వెలుగు దీపమో ... 
మదిలోని భారానికి 
హాయి రాగమో నీవు !

కథవో 
కలవో 
నీటిపై అలవో 
కలవరింతగా మారిన జ్ఞాపకానివో కదా !

నిన్ను మరిచేదెలా 
మరిచి బ్రతికేదెలా 
నిన్ను తలవక రోజు గడిచేదెలా సఖీ !




Wednesday, October 18, 2017

దీపావళి


నింగినుండి నేలను కదా 
చేరుకునేది వెలుగు 
నేలనుండి నింగిని చేరుతోంది 
ఈ రోజు వెలుగు !

జాబిల్లికీ సూరిడికీ సెలవేమో !
కాదులే ఈ రోజు దీపావళి ... 

రాక్షసుడి నేరము 
ఎంత ఘోరము !
ఉండునే కన్న బిడ్డడని దాక్షిణ్యము ?
సంహరించి భూమాత ఓర్చుకుంది దుఃఖము .. 

కన్నవాడైనా తప్పితే పొందడు కారుణ్యము 
గొప్ప మాటను చెప్పిన వెలుగుల పండుగ ఈ దీపావళి 

Saturday, June 18, 2016

అదే ఆనందం ...


చీకటిలో 
వర్షము చెలి నీవు 
అనుభవంలో ఆనందం లాగా 
కనిపించకా 
గుండెను తాకేవు 

ఊహలలో 
వెచ్చతనం చెలి నీవు 
బొమ్మకు మేరుగునిచ్చే 
రంగులాగా 
నా కలలకు 
అందాన్ని తెచ్చేవు 

నువ్వు గుర్తొస్తే 
అదే సంతోషం 
అలాగే ఉండిపోతే 
అదే ఆనందం ... 

Tuesday, May 31, 2016

మాతృపిండం దదామ్యహం...



కన్ను తెరవక ముందే 
అడగక ముందే 
నా ఆకలి తీర్చింది 
అమ్మ కడుపు !

నేను పుట్టి ; కష్ట పెట్టి 
బాదను పంచినా 
ఓర్చుకుని ఊరుకుంది 
అమ్మ కడుపు !

భారమో ఘోరమో !
ఊపిరినుండి ఊయలదాకా 
జీవితం చివరిదాకా 
అన్నీ ఇచ్చింది అమ్మ కడుపు !

నీకు ఏమివ్వగలం ?
ఈ కవిత నీకోసం 
మాతృపిండం దదామ్యహం...  


Monday, January 18, 2016

వటువేశధారి !


వటువు కాదే వీడు విష్ణువు !

సృష్టి నీది కాదా ?
విశ్వము నీది కాదా ?
రాజ్యము ఇవ్వమని 
అడగవచ్చు కదా ... 

సిరుల తల్లి నీకు సతి కాదా ?
రమ్మంటే నీవు వెంటనే రాదా ?
రాజ్యము వదలమని 
చెప్పవచ్చుకదా ... 

యుద్ధమన్నా నీకు కొత్త ఏమీ కాదు కదా ?
గడియలో ఎదుటివాణ్ణి ఓడించేవు కదా ... 
పోరుకి రమ్మని 
అడగవచ్చు కదా .... 

చేతకాని వాడిలా 
"మూడడుగుల నేల" అంటూ 
చేయి జాచినావెందుకు ?
గొప్పతనాన్ని చెప్పినావులే జగముకు ... 

వటువు కాదే వీడు విష్ణువు !

Sunday, October 18, 2015

వచ్చేసాడు సూరీడు ...


                       కమ్ముకున్న చీకటి వైపు 
                  కన్ను ఎర్ర చేస్తూ 
                  వచ్చేస్తున్నాడు సూరీడు ... 

                  మబ్బుల మాయలను 
                  మంటల వేడిలో మసి చేస్తూ 
                  వచ్చేస్తున్నాడు సూరీడు ... 

                  కారు మేఘాలు, మెరుపు తీగలూ 
                  అడ్డు తప్పుకోండి ... 

                  తూర్పును వేదించే రేయిని 
                  వెలుగులకు దూరంగా వెంట తరుముతూ 
                  వచ్చేసాడు సూరీడు ... 

                  నింగి కళ్ళకు గంతెలు తీస్తూ 
                  వెలుగుల వర్షం కురిపిస్తూ 
                  వచ్చేసాడు మండే మార్తాండుడు .... 

                  కన్నీటి అలలూ, చేదు కలలూ 
                  చివరి కోరికలు చెప్పుకోండి ....  

Wednesday, September 2, 2015

తెలియకున్నాను సఖి.... !


నెలవంకతో స్నేహంకోరి,
నీలి మేఘాలు నడిచి వస్తే
తారలన్నీ అసూయతో
తొంగి చూసాయి ...

ఇంటికి రమ్మంటూ
చీకటి మబ్బులు
వెండి వెలుగులకు కబురు చేస్తే
వెలుగులన్నీ నావేనంటూ
జాబిల్లి కళ్ళు చిలిపి చేసాయి ....

మాయలో ముంచిన
మంత్రమేమో చెలి నీవు ...
నిన్ను చూడగా అందరూ ఊరుకున్నారు ...

వెన్నలవో వర్శానివో
మనసును తడిపే తోలి చినుకువో
నా కవితలకు  గమ్యానివో
తెలియకున్నాను సఖి.... !

Saturday, August 15, 2015

దేశ గీతం ...


లే... లేచి నిలబడు సోదరా  
దేశానికి  గెలుపు ఉంది
అడ్డు నీకు ఏముంది?...లే...

కాదు నువ్వు... కాదు నువ్వు..
సోమరితనపు సోగ్గాడు
ఓటమిని ఓర్చేవాడు...కాదు నువ్వు

కాదు నిజం...కాదు నిజం
పొరుగు దేశం గొప్పది
ఈ దేశం మార్పు లేనిది...కాదు నిజం

అడగబోకు  నువ్వు  అడగబోకు
అందరూ తప్పే, నేనైతే తప్పా 
ఒక్కనితో వచ్చేది మార్పా?...అడగబోకు

విడువబోకు నువ్వు విడువబోకు
ఒంటరివైనా పట్టుదలను విడువబోకు
నిన్ను నీవే అడగాలి మరువబోకు

లేచి నిలబడు సోదరా
దేశానికి గెలుపు ఉంది..!


Monday, June 29, 2015

కన్నీరెందుకే దీపమా ...?


కన్నీరెందుకే దీపమా ...?

కాలుతూ వెలుగులు పంచేవు 
వెలుగు-నీడల నడుమ కరిగిపోయేవు ... 
కాళ్ళు తడిసేలా కన్నీరెందుకే దీపమా ...?

నీలాకాశంలోని అంతులేని మౌనం  
మాటరాని మనసులోని ముగిసిపోని భావం 
నీ కళ్ళలొ దాగి ఉంది 
కన్నీటిలొ తడిసిపోతూ ఉంది ...!

కాలే హృదయం, కరిగే దేహం
మండే మనసుల వేదన 
కవి కల్పన దాకా బాదను పంచుతూ ఉంది 

ఓదార్పుకై నీవాడిగా నేనున్నా 
కన్నీరు ఆపుకోవే దీపమా .... !

Friday, May 1, 2015

మారరా ఓ మనిషి !


జంతువైనా జీవమున్నదే 
నీ ప్రాణమల్లే విలువైనదే  

పలకలేదు పాపం 
బుద్ధి-హీనత విధాత ఇచ్చిన శాపం 
తెలుసుకోరా మనిషి 

ఏ దేవుడికి ఈ నైవేద్యం ?
పొట్ట నింపడమే నీ గుడ్డి గమ్యం 
మారరా ఓ మనిషి 

చావు కేక ఎంత ఘోరం !
అయినా కరగదు; బండరాయి నీ హృదయం 
నువ్వు మారవురా మనిషి ... 

Saturday, March 21, 2015

గూటికి వెళ్ళవే చిలుకా... !


పొద్దు వాలిపోయే
పడవ వెళ్ళిపోయే
పండుకోసం వెతికేవే చిలుక !
గూటికి వెళ్ళకా ...  

పొరుగూరి చిలుకలు ఎగిరిపోయే,
పువ్వులో నవ్వులు ఎండిపోయే,
పైరగాలిలో పరుగులు తీసేవే చిలుక !
గూటికి వెళ్లకా...  

పున్నమి-రోజు కాకపోయే, 
పండువెన్నెల లేకపోయే, 
పైకి చూస్తూ ఎవరిని వెతికేవే చిలుక !
గూటికి వెళ్ళకా ... 

పెదవిపైన మాటలన్నీ ఎండిపోయే, 
మనసుల నడుమ దూరం పెరిగిపోయే, 
పంతమెందుకే గోరింకతో చిలుక !
గూటికి వెళ్ళకా ... 

Thursday, January 1, 2015

మత మాంద్యం!!



అమ్మ కడుపులో పంచుకున్న 
నెత్తురికి లేదు మతం ... 
ఆగసం దాటి నడిచొచ్చిన 
వర్షానికి లేదు మతం ... 

ఆకలి తీర్చే అన్నానికి లేదు మతం 
ఊహను దాటించే కలలకు లేదు మతం ... 
ఎక్కడిది ఈ మతం ?

మతం అంటే 
రొమ్ములో దమ్ములు కన్ను తెరిచేనేల ?
కులం అంటే 
నెత్తురులో పంతము పొటెత్తునేల ?
అన్నలూ, వేమన్నలూ చెప్పినా నమ్మవేల !!!

మతానికి దేవుళ్ళు దారి చూపారా ?
ఆచారంతో కులాల కడుపు-నింపుతున్నారా?
ఎవరు సృష్టించారు మతం ?

మనుజ మతం, విశ్వ మతం అని చాటి చెప్పరా సొదరా... 


Friday, November 7, 2014

అబద్దాల జ్ఞాపకాలు....!


             పిలిస్తే పలికేనని 
             రమ్మంటే జాబిలి వచ్చేనని 
             ఆకలి సమయంలో 
             గోరుముద్దకోసం అమ్మ చెప్పింది ఓ అబద్దం ...!

             వెతకలేనంటూ 
             దాగుడుమూతలో ఓడినానంటూ 
             చిన్న పెదవిపైన చిరునవ్వుకోసం 
             నాన్న చెప్పినాడు ఓ అబద్దం ...! 

            చీకటంటే సూరీడికి సెలవని 
            ఉరుములంటే మేఘాల కోపాలని 
            తెలియదు ఎందుకో 
            బామ్మ చెప్పింది ఓ అబద్దం ...! 

            ఇసుకలో గుడిని 
            కాయితంలో పడవని 
            చేసినవారే గొప్ప అని 
            సరదాకోసం స్నేహితుడు చెప్పినాడు ఓ అబద్దం ...!

            మరెన్నో అబద్దాలు వింటూ 
            కలతలేని చందమామలా నవ్వుకొంటూ 
            హాయిగా గడిపిన ఆ రోజులు 
            మళ్ళీ వచ్చేనా ... ?  

Thursday, October 9, 2014

మేఘాలతో మాటలు ... !


పడమటి చివర 
చీకటి దేశమా ...?
తూర్పును తడిపే 
వెలుగుల సంద్రమా ...?
మీ ఊరేది ?

జాబిల్లికి జోలలు పాడే 
తారల తీరమా ...?
అంతులు దొరకని 
ఆగసాల హృదయమా ...?
మీ ఇల్లేది ?

వెండి చినుకలలో విరిసే 
హరివిల్లుల వైనమా ...?
మంచును కురిపించే 
చలిగాలి ఉదయమా ...?
మీ భావమేది ?

నీడలు లేని 
సూరీడు నడిచే మార్గమా ...?
వెన్నెల వానలు కురిసే 
పున్నమి కాలమా ...?
మీ దారేది ?

తోడుగా ఒకరికి ఒకరు 
మౌనముగా పలుకనే పలుకరు 
ఎక్కడిదాకా మీ పయణం ?
ఏమిటి మీ గమ్యం ?


Tuesday, August 19, 2014

స్వరాజ్యం!


            తెల్లవారితే  తొలివెలుగులన్నీ
            తెల్ల-దొరకే సొంతమన్న రోజులవి ... !
            పండే భూమిలొ పైరలన్నీ
            పన్ను కడితేనే సొంతమన్న రోజులవి ...!

            చెరసాల చీకటిలో 
            బ్రతుకులు గడిచిపోయిన రోజులవి ...!
            ఉద్యమం దారిలో 
            కన్నవారిని కాదనుకున్న రోజులవి ...!

            బానిస బ్రతుకులను
            ఒద్దనలేక ఓర్చుకున్న రోజులవి ...!
            మంచి రోజులు ఎప్పుడని 
            ప్రతి క్షణం ఎదురుచూసిన రొజులవి...!

            పస్తులతో ప్రాణాలు వదిలితే వచ్చింది స్వరాజ్యం
            తూటాలకు తిరగబడితే  వచ్చింది స్వరాజ్యం
            వందేమాతరం అంటూ వేలల మంది పోరాడితే వచ్చింది స్వరాజ్యం ..
           
            స్వరాజ్యపు విలువను
            నేటి నేతలకు తెలియజెప్పవే భరత-మాత ....  

Sunday, July 13, 2014

మనం !...... మనుషులం !


కలిసి ఉన్నవారు కాస్త విడిపోతె,
కరిగిపోయేను మనసులు 
దూరమైనవారు మళ్ళీ దగ్గరైతె,
కొత్తగా విరిసేను ప్రేమలు ...

కలిసిపోయేలా కళ్ళూ కళ్ళూ ఒకటైతె,
మూగబోవును ఎన్నో మాటలు ... 
కనిపించకా ఎంతో దూరం వెళ్ళిపోతె,
మనసెన్నో పలికేను భావాలు ... 

కలవాలంటూ మనసు కలవర పడితె,
గుండె చప్పుడు గుర్తు చేసేను జ్ఞాపకాలు 
మరువలేమంటూ కళ్ళు గొడవపడితె,
మనసు వెంట నడిచి వచ్చేను మరెన్నో కలలు ... 

దేవుని సృష్టిలొ గొప్ప జీవులం మనం .... మనుషులం ... 
 

Sunday, June 8, 2014

నా చెలి నిదిరించు వేళ ....



              సడి సేయకా సర్దుకొమ్మని,
           చేతి గాజులకు చెవిమాటగా చెప్పాలి !
           పలుకు లేక కునుకు తీయమని,
           కాళ్ళ పట్టీలకు మరోసారి గుర్తు చేయాలి ! 

           సెగలు పుట్టేను మరి !
           రెండు చేతులా, నిండు వెన్నలను పట్టి తేవాలి ... 
           ఉలికి-పడేను మరి !
           కంట చివరే చేదు కలలకు ఆగమని చెప్పాలి ... 

           నిదురలోనూ,
           ఆమె వెండి నవ్వులు ఎండిపోకా ఉండిపోవాలి ... 
           మైమరిచేలా ,
           కంటిపాపలు ఆమె మనసుకు జోలలు పాడాలి ... 

           నా చెలి నిదిరించువేళ .... !

Sunday, April 20, 2014

గెలుపు నీదె ...




                           తూర్పుకు తలుపులు వేస్తె చీకటి 
                           ఓర్చుకుని ఊరుకోదు ఉదయం 
                           వెలుగుల వెంట కదిలి వస్తుంది !

                           ప్రవహించె నీరుని కుండలొ పడితె 
                           నడక మరిచి నిలిచిపోదు 
                           విడచిన వెంటనె పరుగులు తీస్తుంది !

                           మట్టిలొ విత్తనాన్ని పూడిస్తె 
                           ఊపిరాడక అక్కడె చనిపోదు 
                           ఊపిరిపోసె మోక్కగా లేచి వస్తుంది !

                           ఓర్పుకి పట్టుదల తోడైతె 
                           ముందడుగులొ గెలుపు నీదె నేస్తమా ....